Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 33

Brahmadatta marries Kusanabha's Hundred daughters !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

తస్త తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః |
శిరోభి శ్చరణౌ స్పృష్ట్యా కన్యా శతమభాషత ||

తా|| ఆ ధీమంతుడైన కుశనాభుని ఆ వాక్యములను విని , శిరములతో పాదాభి వందనము చేసి ఆ నూఱుమంది కన్యలు ఇటుల పలికిరి.

బాలకాండ
ముప్పది మూడవ సర్గము.

ఆ ధీమంతుడైన కుశనాభుని ఆ వాక్యములను విని , శిరములతో పాదాభి వందనము చేసి ఆ నూఱుమంది కన్యలు ఇటుల పలికిరి.

"ఓ రాజా ! సర్వాత్మలలో ప్రవేశించు వాయుదేవుడు అశుభమైన మార్గమును అనుసరించి మమ్ములను బలాత్కరించ తలచెను. ' మేము తండ్రి చాటు బిడ్డలము, మేము స్వతంత్రులము కాము. మా తండ్రినే అడుగుడు మీకు మమ్ములను ఇచ్చునా' అని చెప్పితిమి. మేమందరమూ ఇట్లు పలుకు చుండగా మా మాటలు వినకుండా ఆ పాపాత్ముడు మా అందరినీ తీవ్రముగా గాయపరచెను'.

ఆప్పుడు తేజస్వి యూ పరమ ధార్మికుడు అయిన ఆ రాజు ఆ ఉత్తమమైన నూరుమంది కన్యలకు ఇట్లు సమాధానమిచ్చెను'.

"ఓ పుత్రికలారా ! క్షమాశీలురు చేయదగిన పనిని మీరు చేసితిరి. ఇకమత్యముతో మెలిగి మన వంశ ప్రతిష్ఠలు నిలబెట్టితిరి. పురుషులకైనా స్త్రీలకైనా క్షమాధర్మమే అలంకారము. క్షమాధర్మము కలిగియుండుట అరుదైన విషయము. మీరు ప్రదర్శించిన క్షమాధర్మము దేవతలకు కూడా దుష్కరమైనది . ఓ పుత్రికలారా ! క్షమయే దానము, క్షమయే యజ్ఞము, క్షమయే సత్యము, క్షమయే యశస్సు, క్షమయే ధర్మము, క్షమతో నే ఈ జగత్తు అంతయూ నిలబడిఉన్నది".

అప్పుడు ఆ కకుస్థుడైన ఆ రాజు ఆ కన్యలను విడచి, తన మంత్రులతో దేశకాలములకు అనుగుణముగా ఆ కన్యల కన్యాదాన విషయమై బాగుగా అలోచించెను.

అదే కాలములో చూళీ అను పేరుగల గల మహాముని యుండెను. అతడు ఇంద్రియ నిగ్రహము కలవాడు. సదాచారసంపన్నుడు. బ్రహ్మము గురించి తపమొనర్చుచుండును. ఆ విధముగా తపమొనర్చుచున్న ఆ ఋషికి ఊర్మిళ కూతురైన 'సోమద' అను గాంధర్వి సేవలు చేయు చుండెను. ఆ సోమద శుశ్రూషపరాయణురాలై ఆయనకు నమస్కరించుచూ సేవలొనర్చుచుండెను. కొంతకాలము పిమ్మట ధర్మదృష్ఠిగల ఆమె సేవలకు ఆ మహాముని సంతుష్ఠుడాయెను.

ఓ రఘునందనా ! కాలయోగము చేత ఆ ముని ఆ గాంధర్వవనిత తో , ' నీ సేవలతో సంతుష్టుడనైతిని. నీకు శుభమగుగాక. నీకు ఏమి కావలెనో కోరుకొనుము' అని పలికెను.

ఆ ముని సంతుష్టుడైన విషయము గ్రహించి వాక్చాతుర్యము గల ఆ సోమద మధుర స్వరముతో సంతోషముగా వాక్యముల అంతరార్థము తెలిసిన ఆ ఋషితో ఇట్లు పలికెను.' ఓ మహామునీ నీవు తపమునొనరించి బ్రహ్మ వర్చస్సుతో వెలుగొందుచూ బ్రహ్మతుల్యుడవైతివి. ఓ ధర్మబుద్ధీ బ్రహ్మజ్ఞానముకల ఒక పుత్రుని నాకు ప్రసాదింపుము ' అని. 'నేను పతి లేని దానను. నేను ముందు కూడా ఏవరికి భార్యను కాబోను.నీకు శుభమగుగాక. నీ బ్రహ్మ తేజస్సు ప్రభావమున నాకు పుత్రుని అనుగ్రహింపుము'.

అప్పుడు ప్రసన్నుడైన ఆ మహర్షి ఒక ఉత్తమమైన కుమారుని ప్రసాదించెను. అతడు 'ఛూళీ" మానసపుత్రుడుగ బ్రహ్మదత్తుదను పేరుతో ప్రఖ్యాతి పొందెను.

అప్పుడు ఆ సోమద కుమారుడు అగు బ్రహ్మదత్తుడు , అమరావతిని ఇంద్రుడు పరిపాలించిన రీతిగా, కాంపిల్య నగరమును పరిపాలించుచుండెను. ఓ రామా ! గొప్ప ధర్మబుద్ధి గల కుశనాభ మహారాజు తన నూరుగురు కన్యలను బ్రహ్మదత్తునకు ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించెను. అప్పుడు ఆ మహీపతి మహాతేజోవంతుడైన ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి సంతోషముతో ఆ నూరుగు కన్యలనిచ్చి వివాహమొనర్చెను.

ఓ రఘునందనా ! ఆ బ్రహ్మదత్తుడు ఇంద్రవైభవముతో విలసిల్లుచూ యథాక్రమముగా అ వధువుల హస్తములను గ్రహించెను. అప్పుడు స్పర్సమాత్రముననే ఆ కన్యల కుబ్జత్వము పోయెను,వారి మనోవ్యథలు పోయెను. వారు నిరుపమాన సౌందర్యముతో విలసిల్లిరి. వాయుపీడనుంచి ముక్తులైన వారిని చూచి ఆ మహీపతి ఎంతయూ సంతసించెను.మరల మరల హర్షాతిరేకము పొందెను.

ఆ మహీపతి బ్రహ్మదత్తుని కి ఇచ్చి తన కుమార్తెల వివాహము చేసిన పిమ్మట, అయనను పత్నులతో సహా , పురోహితులతో కలిపి పంపివేసెను

తల్లి అయిన సోమద కూడా పుత్రుని వివాహము జరిగినందుకూ, వారికి సద్రుశముగా అయిన కార్యమునకు మిగుల సంతోషపడెను. ఆ గాంధర్వి తన కోడళ్లతో మిగుల సంతోషపడి కుశనాభుని ప్రశంసించెను.

||ఈ విధముగా వాల్మీకి రామాయనములోని బాలకాండలో ముప్పది మూడవసర్గ సమాప్తము ||

||ఓ తత్ సత్ ||

సోమదాsపి సుసంహృష్టా పుత్రస్య సదృశీం క్రియామ్ |
యథాన్యాయం చ గంధర్వీ స్నుషాస్తాః ప్రత్యనందత |
స్పృష్ట్వా స్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ ||

తా|| తల్లి అయిన సోమద కూడా పుత్రుని వివాహము జరిగినందుకూ, వారికి సద్రుశముగా అయిన కర్యమునకు మిగుల సంతోషపడెను. ఆ గాంధర్వి తన కోడళ్లతో మిగుల సంతోషపడి కుశనాభుని ప్రశంసించెను.
||ఓమ్ తత్ సత్||


|| Om tat sat ||